గుంటూరు, నవంబర్ 21: గుంటూరు వైద్య కళాశాలను ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపాల్, అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వి. సుందరాచారి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. క్యాంపస్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించి, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కళాశాల క్యాంటీన్, గ్రంథాలయం వద్ద రూ.2 లక్షల విలువైన రెండు వాటర్ కూలర్లు, ఆర్వో శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేశారు.
కళాశాల పూర్వ విద్యార్థిని, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత ఈ పరికరాలను విరాళంగా అందించారు. డీఎం న్యూరాలజీ పూర్తి చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తనకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ సుందరాచారి వద్ద డీఎం న్యూరాలజీలో శిక్షణ పొందిన తొలి విద్యార్థినిగా, తన గురువు అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన గురువు స్ఫూర్తితో కళాశాలకు ఈ సేవా కానుకను అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
1954 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి, ఇదే కళాశాలలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తన మామ డాక్టర్ అయ్యగారి అశ్వినీకుమార్ చేతుల మీదుగా వాటర్ కూలర్లు, ఆర్వో వ్యవస్థలను ప్రారంభించడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని డాక్టర్ లలిత వెల్లడించారు.Guntur City News
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత క్యాంపస్ నిర్మాణం ఒక్కరోజుతో పూర్తయ్యే కార్యక్రమం కాదని, పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెంపొందించే నిరంతర ప్రక్రియ అని అన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించేందుకు కళాశాలలో స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఎనిమిది దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాలను విద్యా ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
గురువు స్ఫూర్తితో శిష్యురాలు అందించిన సేవా సహకారం కళాశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి నరసింహన్, సీనియర్ పాత్రికేయులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



