దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.47,85,484 విలువైన చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు వైద్య ఖర్చులకు సంబంధించిన నగదు రసీదులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన బాధితులకు కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు.Prakasam district news
సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు గంజాం రాఘవేంద్ర, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, కూరపాటి శ్రీనివాసరావు, పిడతల నెమలియ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు సత్యనారాయణతో పాటు నియోజకవర్గంలోని పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.



