మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ నిరసనగా తమ మొక్కజొన్న పంటలను తగలబెట్టారు.ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ మాట్లాడుతూ, పెరిగిన ఖర్చుల కారణంగా రైతులకు లాభసాటి ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని విమర్శించారు.వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ప్రతి రైతు పండించిన మొత్తం మొక్కజొన్నను కనీసం రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలని, ఇప్పటికే అమ్ముకున్న రైతులకు వ్యత్యాస ధర చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.



