అమృతలూరు (గోవాడ), అక్టోబర్ 05:-రైతుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు గారు ఉద్ఘాటించారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమంలో రీ-సర్వే పూర్తయిన 1,906 మంది అర్హులైన రైతులకు ఆయన ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీ నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ, “మీ భూమి – మీ హక్కు” అనే నినాదంతో ప్రభుత్వం భూపరిపాలనలో పూర్తి పారదర్శకతను తీసుకొచ్చిందన్నారు. గతంలో లాగా వ్యక్తిగత ఫోటోలు లేకుండా, కేవలం అధికారిక రాజముద్రతోనే ఈ పాస్‌పుస్తకాలను జారీ చేయడం ద్వారా రైతులకు భూమిపై సంపూర్ణ హక్కును కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజముద్ర పాస్‌పుస్తకాలు బ్యాంకులు, సబ్సిడీలు, ఇతర సంక్షేమ పథకాలు పొందడంలో రైతులకు ఎంతో మేలు చేస్తాయని, రీ-సర్వే వల్ల సరిహద్దు వివాదాలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
అమృతలూరు మండలంలో ఇప్పటివరకు 4,284 పాస్‌పుస్తకాల పంపిణీ:
కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ, మండలంలోని 13 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే 5 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 4,284 పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని వెల్లడించారు.
- బోడపాడు: 360
- ఎలవర్రు: 648
- కోరుతాడిపర్రు: 578
- పెదపూడి: 862
- అమృతలూరు: 1,836
గోవాడ గ్రామంలో నేడు పంపిణీ చేసిన 1,906 పాస్‌పుస్తకాలతో పాటు, ప్యాపర్రు గ్రామంలో రీ-సర్వే పూర్తయినందున వచ్చే నవంబర్ నెలలో మరో 420 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ నిర్దేశిత గడువులోగా రీ-సర్వే పూర్తి చేసి పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.Bapatla City News
ఈ పంపిణీ కార్యక్రమంలో మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతు సోదరులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



