గుడివాడ (సిటీ న్యూస్):-కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పీఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన” పథకాన్ని వినియోగదారుల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు గుడివాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈనెల 6, 7, 8 తేదీలలో ప్రత్యేక అవగాహన క్యాంప్‌ను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘సేవా సేతు అభియాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ, బ్యాంకింగ్ రంగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.
ఈ అవగాహన క్యాంప్‌ను స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఆయన, సోలార్ ప్యానెళ్ల అమరిక, వినియోగదారులకు అందే ప్రయోజనాలపై విద్యుత్ శాఖ అధికారులు మరియు బ్యాంకింగ్ ప్రతినిధులతో మాట్లాడారు.
పథకం వివరాలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) జి.బి.శ్రీనివాసరావు ‘సిటీ న్యూస్’ ప్రతినిధికి వివరిస్తూ.. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు అపారమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే మొత్తం ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందని వెల్లడించారు. దీనివల్ల ఉచిత విద్యుత్ లభించడమే కాకుండా, నెలవారీ కరెంట్ బిల్లుల భారం గణనీయంగా తగ్గి ఆర్థికంగా ఎంతో ఆదా అవుతుందని పేర్కొన్నారు.Krishna district news
మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్యానెళ్ల ఏర్పాటుకు అవసరమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ రుణాలు మరియు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వినియోగదారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.



