GUNTUR DISTRICT NEWS: ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలి

Karthik

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ చానల్స్, కేబుల్ చానెల్, సినిమా హాల్ తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి అభ్యర్థులు మీడియా సర్టిఫికేషన్ మరియు మీడియా మానిటరింగ్ (ఎం.సి.ఎం.సి) టీమ్ కు కనీసం మూడు రోజులు ముందుగా చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ప్రకటన ఇవ్వదలిచిన విషయంగల వీడియో, అందులోని అంశాలకు సంబంధించిన స్క్రిప్ట్, సమయం, తయారీ ఖర్చు, ఏ మీడియాలో ప్రసారం చేస్తున్నారు, అందుకు జరిగే వ్యయం తదితర అంశాలను సమర్పించాలని చెప్పారు. ప్రసారం చేసే వీడియోలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మాత్రమే ఉండాలని అన్నారు. ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా లేని ప్రకటనలకు అనుమతులు జారీ ఉండదన్నారు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎం.సి.ఎం.సి టీమ్ పెయిడ్ న్యూస్ ను కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను సైతం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్.ఎం.ఎస్ రూపంలో ఇచ్చే మెసేజ్ లకు, వాయిస్ మెసేజ్ లకు కూడా అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజు ఇచ్చే ప్రింట్ మీడియా ప్రకటనలకు కూడా అనుమతులు తప్పనిసరి అన్నారు.ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని కోరారు. పోస్టర్లు, కరపత్రాలు ముద్రిస్తే వాటి సంఖ్య, ఖర్చు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మాత్రమే ముద్రించినట్టు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review