రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే మండలాలకు ప్రత్యేక అధికారులను, రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని వివరించారు. జిల్లాలో రెండు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెనాలి రెవెన్యూ డివిజన్ లో గల చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, కొల్లిపర మండలాలు., గుంటూరు రెవెన్యూ డివిజన్ లో గల పెదకాకాని మండలంలో రెండవ విడతలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ లో గల మేడికొండూరు, ఫిరంగిపురం, గుంటూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాలు., తెనాలి రెవెన్యూ డివిజన్ లో గల కాకుమాను, దుగ్గిరాల మండలాల్లో మూడవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. *నామినేషన్ల షెడ్యూల్*- రెండవ విడతలో నవంబరు 18 నుంచి 20వ తేదీ వరకు.- మూడవ విడతలో నవంబరు 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రతి విడతలోనూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.*అభ్యర్థుల అర్హతలు, నిబంధనలు*సర్పంచ్ లేదా వార్డు సభ్యునిగా పోటీ చేసే అభ్యర్థి సంబంధిత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలన్నారు. సర్పంచ్ పదవికి ప్రతిపాదన చేసే వ్యక్తి సంబంధిత గ్రామ పంచాయతీలోని ఏదైనా వార్డులో ఓటరుగా నమోదై ఉండాలని స్పష్టం చేశారు. వార్డు సభ్యుని పదవికి ప్రతిపాదన చేసే వ్యక్తి సంబంధిత వార్డులోనే ఓటరుగా ఉండాలన్నారు.నామినేషన్ పత్రాలను అభ్యర్థి లేదా ప్రతిపాదన చేసే వ్యక్తి స్వయంగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలోకి ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.ఒకే పదవికి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాన్ని లేదా నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ కంటే తక్కువ హోదా కాని రెవెన్యూ అధికారి ఎదుట చేసిన కుల సంబంధిత ప్రకటనను సమర్పించవచ్చన్నారు. *డిపాజిట్ వివరాలు* – గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు : రూ.1,000 (ఇతరులు), ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500.- గ్రామ పంచాయతీ సర్పంచ్ : రూ.3,000 (ఇతరులకు), ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,500.*ఎన్నికల వ్యయ పరిమితి* – 10,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునికి రూ.60,000.- 10,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునికి రూ.1,00,000.- 10,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు రూ.2,50,000.- 10,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు రూ.4,00,000.నామినేషన్ పత్రాలు స్వీకరించిన వెంటనే రిటర్నింగ్ అధికారి వాటిని ప్రాథమికంగా పరిశీలించి, సమర్పించాల్సిన పత్రాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటి వివరాలతో కూడిన చెక్‌లిస్టును అభ్యర్థికి లేదా నామినేషన్ సమర్పించిన ప్రతిపాదకునికునికి ఇవ్వాలని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన రోజువారీ నివేదికలను ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నాటికి సమర్పించాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని కోరారు. ఎన్నికల అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను పక్కాగా పాటించాలని ఆదేశించారు.



