పట్టణ స్థానిక సంస్థలు పోలింగ్ కు సర్వం సిద్ధం

Karthik

నవంబర్ 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల్లో పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు. ఓటర్లందరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసీ), పొన్నూరు మున్సిపాలిటీలలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని, అదే స్పూర్తితో ఎన్నికల నిర్వహణ చేయాలని సూచించారు. ఎంటిఎంసీలో 62 వార్డులు, పొన్నూరు మున్సిపాలిటీలో 40 వార్డులు కలిపి మొత్తం 102 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంటిఎంసీలో 261, పొన్నూరులో 84 కలిపి మొత్తం 345 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఈ రెండు పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి మొత్తం 2,97,913 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎంటిఎంసీలో 2,37,713 మంది, పొన్నూరులో 60,200 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లతో కలిపి సుమారు 2,201 మంది సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. నవంబర్ 26వ తేదీన పోలింగ్, నవంబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంటిఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశామని, పొన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి జీబీసీ రోడ్డులోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేశామని పేర్కొన్నారు.*పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం*ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. *ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి*జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల ఎన్నికల్లో ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review