పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

Karthik

పన్నుల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడంతో పాటు పౌరులకు వేగవంతమైన సేవలను అందించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, ఎక్కడి నుండైనా సులభంగా చెల్లించే వెసులుబాటు అందుబాటులో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన శాఖ అధికారిక వెబ్‌సైట్ https://cdma.ap.gov.in/ ద్వారా ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ చెల్లింపుల విధానం వల్ల సెలవు దినాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నిమిషాల వ్యవధిలో చెల్లింపులు పూర్తి చేయవచ్చని, ప్రతి చెల్లింపుకు తక్షణమే ఆన్‌లైన్ రసీదు లభిస్తుందని వివరించారు. దీని వల్ల సేవల్లో వేగం పెరగడమే కాకుండా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు. నగర అభివృద్ధిలో పన్నుల చెల్లింపు అత్యంత కీలకమని, బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ సకాలంలో తమ పన్నులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించి నగర ప్రగతికి సహకరించాలని కోరారు.

Author
Share This Article
Leave a review