తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా 2025 మంది తో పటిష్టమైన బందోబస్తు – జిల్లాలో రేపు గురువారం జరగనున్న తాడేపల్లి- మంగళగిరి కార్పొరేషన్, పొన్నూరు పురపాలక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్, మంగళగిరి టౌన్, రూరల్, పొన్నూరు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధివిధానాలు, చేయకూడని పనుల గురించి వివరించారు. పోలీసు సిబ్బంది రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఓటర్లతో అనవసరంగా మాట్లాడకుండా, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సిబ్బంది తప్పనిసరిగా లాఠీ, విజిల్ కలిగి ఉండాలని సూచించారు.పోలింగ్ సిబ్బంది ఈరోజే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రాత్రంతా భద్రత కల్పించాలని, రేపు ఉదయం పోలింగ్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బందికి ఆయా గ్రామాలు, పోలింగ్ కేంద్రాల పరిస్థితులపై ముందస్తు బ్రీఫింగ్ ఇవ్వాలని ఆదేశించారు.పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సమన్వయంతో చేయడం జరుగుతుందని, రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఆహారం, వస్తువులు లేదా ఇతర ప్రయోజనాలు స్వీకరించకూడదని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన గుంపులు, ప్రచార కార్యక్రమాలు, అనధికార కార్యకలాపాలు లేకుండా చూడాలని, ఓటర్లకు తాగునీటి సౌకర్యం మినహా ఇతర పార్టీ సంబంధిత ఏర్పాట్లకు అనుమతించకూడదని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు, గుర్తులు ధరించి 200 మీటర్ల పరిధిలో ఉండకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి పార్టీ తరఫున ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండేలా చూడాలని, అదనపు ఏజెంట్లు లేదా అనధికార వ్యక్తులను అనుమతించకూడదని ఆదేశించారు. 200 మీటర్ల పరిధి దాటి ఏర్పాటు చేసే టెంట్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురికి మించి వ్యక్తులు గుమిగూడకుండా చూడాలని తెలిపారు.ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే సమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మొబైల్ ఫోన్లు, అగ్గిపెట్టెలు, ఇంకు బాటిళ్లు తదితర నిషేధిత వస్తువులు లోపలికి తీసుకెళ్లకుండా చూడాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లు, పోలింగ్ సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి లేదని, పోలీసు సిబ్బంది కూడా అనవసరంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా, అవసరమైన సందర్భాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతితోనే ప్రవేశించాలని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు విధిగా అనుమతి పాసులు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీకి నిబంధనల మేరకు సహకరించాలని, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వీడియో పర్యవేక్షణ ఉండేలా చూడాలని తెలిపారు.



