Amaravathi News :గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ-మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్

Sharat
1 View

అమరావతి:- గుంటూరు సమీపంలోని ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్‌ఐవైఎన్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం మంగళవారం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా ఉందని ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మూడు నెలల్లో స్థల అభివృద్ధి, రహదారి, వర్షపు నీటి కాలువలు తదితర మౌలిక వసతుల పనులను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని, అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 2028 నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15.03 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్‌వైఎన్‌) ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంస్థ దేశంలో యోగా, ప్రకృతి వైద్య రంగంలో అత్యున్నత పరిశోధనా కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. యోగా, ప్రకృతి వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం, వాటి ప్రభావాన్ని నిర్ధారించడం, వైద్యులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.

సంస్థ ప్రాంగణంలోనే 100 పడకల సామర్థ్యంతో ప్రత్యేక యోగా–ప్రకృతి వైద్య ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు యోగా, ప్రకృతి వైద్యంతో సమగ్ర చికిత్స అందించడంతో పాటు పరిశోధన, శిక్షణ, వైద్య సేవలు ఒకేచోట అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అత్యాధునిక పరిశోధనా ప్రయోగశాలలు, ప్రత్యేక చికిత్సా విభాగాలు, శిక్షణా కేంద్రాలు, అవసరమైన అన్ని మౌలిక వసతులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కానున్నాయి.

దేశంలో ఇప్పటికే హర్యానాలోని జజ్జర్, కర్ణాటకలోని నాగమంగళ, అస్సాంలోని డిబ్రూగఢ్ ప్రాంతాల్లో ఇలాంటి పరిశోధన సంస్థలు పనిచేస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఒడిశాలోని జట్నీలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సంస్థ ఏర్పాటవడం ద్వారా యోగా, ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధన, వైద్య సేవలు, శిక్షణకు రాష్ట్రం జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

స్థల పరిశీలన సందర్భంగా ప్రతిపాదిత ప్రాంతం సంస్థ ఏర్పాటుకు పూర్తిగా అనుకూలంగా ఉందని కేంద్ర బృందం నిర్ధారించింది. వర్షపు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మూతలతో కూడిన సిమెంట్ కాలువ నిర్మించాలని, జాతీయ రహదారి–16 నుంచి ప్రభుత్వ భూమి మీదుగా 40 అడుగుల వెడల్పుతో ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలని సూచించింది. జాతీయ రహదారి కంటే దిగువన ఉన్న ప్రాంతాలను మట్టితో నింపి చదును చేయడం, ప్రజా రవాణా సౌకర్యం కోసం సమీపంలో బస్‌స్టాప్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ రహదారి–16కు ఆనుకుని, గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్రధాన అనుకూలతగా అధికారులు పేర్కొన్నారు.

ప్రతిపాదిత స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, రాష్ట్ర ఆయుష్‌ శాఖ సంచాలకులు గోపాలకృష్ణ రోణంకి, కేంద్ర యోగా–ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ జ్యోతి కేస్వానీ, కేంద్ర ఆయుష్‌ శాఖ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ ప్రమోద్ వర్మ, పరిశోధన అధికారి డాక్టర్ ఎన్‌.వి. జ్ఞానదీప్ తాటవర్తితో కలిసి పరిశీలించారు. అధికారులు సూచించిన మేరకు మౌలిక సదుపాయాల పనులను వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులో కేంద్ర ప్రభుత్వానికి స్థలాన్ని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Author
Share This Article
Leave a review