GUNTUR CITY NEWS: వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలి

Karthik

వైసీపీ వాళ్లకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నేతల్లో మాత్రం ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతామనే భయంతోనే ఏదో ఒక కారణాన్ని తెరపైకి తెచ్చి, అధికారుల పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. ప్రతి చోటా ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా తప్పనిసరిగా పోటీ చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే, ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆ భయానికి ఏదో ఒక నెపం చూపించాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఏర్పడిందని అన్నారు.అధికారులు ఎన్‌ఓసీలు ఇవ్వకుండా చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించటం చూస్తుంటే, వైసీపీ నేతలు తమ ఓటమికి ఇప్పటి నుండే సిద్ధం అవుతున్నారని, అధికారులు అందరికీ సమన్యాయం చేస్తారని, నిబంధనల ప్రకారమే ఎన్‌ఓసీలు జారీ చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి అవసరమైన ఎన్‌ఓసీలు తప్పకుండా వస్తాయని తెలిపారు.గత ఐదేళ్లలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేయకుండా అరాచక పాలన సాగించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రశ్నించారు.ఎన్నికలను ఎదుర్కొనేందుకు కూటమి పార్టీలు పూర్తి సంసిద్ధంగా ఉన్నాయని గళ్ళా మాధవి తెలిపారు. ప్రతి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సగర్వంగా, ఎంతో ధీమాతో ఎన్నికల బరిలోకి వెళ్లబోతున్నామని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో కూటమి పార్టీదే విజయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Author
Share This Article
Leave a review