పిల్లలు చదివే పాఠశాలలు దేవాలయాల వంటివని, పరిశుభ్రమైన వాతావరణంలో చదివించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గురువారం నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాజరు, పాఠశాలలోని మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితిని పరిశీలించారు. 6వ తరగతి విద్యార్థినులు తరగతి గది లేక బయట కూర్చొని చదువుకోవడం, పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం, కంప్యూటర్ ల్యాబ్ శిథిలావస్థలో ఉండడం గమనించిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్యటన సమాచారం అందుకుని ఎంఈఓ నాగేంద్రమ్మ పాఠశాలకు చేరుకోగా, పాఠశాల కరస్పాండెంట్, ఎంఈఓ మధ్య సరైన సమన్వయం లేకపోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు.*అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…* గతంలోనూ ఈ పాఠశాల, ఎస్సీ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒకప్పుడు వేలాది మంది బాలికలు చదువుకున్న స్టాల్ గర్ల్స్ హైస్కూల్ పశ్చిమ నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిందన్నారు. అయితే కాలక్రమేణా నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం విద్యార్థినుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలకు వెళ్లే రహదారి సరిగా లేకపోవడం, గతంలో సూచించినప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, బాలికల హాస్టల్ పరిసరాలు అడవిని తలపించేలా ఉండడం ఆందోళన కలిగించే అంశాలని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.పెద్ద పెద్ద తరగతి గదులు ఉన్నప్పటికీ వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తూ విద్యార్థినులను బయట కూర్చోబెట్టడం సరికాదని, వెంటనే వారికి ప్రత్యేక తరగతి గదులు కేటాయించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించినట్లు తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్ నిర్వీర్యంగా మారడం, స్టోర్‌రూములు అధ్వాన్నంగా ఉండడం, కొన్ని తరగతి గదుల్లో సరిపడా ఫ్యాన్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న విషయాలను కూడా ప్రస్తావించారు.ఈ పాఠశాల ఎయిడెడ్ సంస్థ కావడంతో ప్రభుత్వ నిధుల పరంగా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, యాజమాన్యం పూర్తి బాధ్యతతో వ్యవహరించి సంస్థకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ పనులతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎమ్మెల్యే సూచించిన అంశాలను వారం రోజుల్లో సరిదిద్దుతామని పాఠశాల ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారం రోజుల తర్వాత మరోసారి పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అధికారులు, యాజమాన్యం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే స్టాల్ గర్ల్స్ హైస్కూల్‌కు తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.



