విజయవాడ:- పశ్చిమ నియోజకవర్గంలోని మైనారిటీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీల సంక్షేమానికి సుమారు రూ.23,450 కోట్లను ఖర్చు చేశారని బాజీబాబా పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని అన్నారు.
ఎన్నికల ముందు ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన షాదీతోఫా పథకం ఏమైందని ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, ఆ హామీని కూడా విస్మరించారని ఆరోపించారు.
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్న ముస్లిం కుటుంబాలకు ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ల స్థలాలు కేటాయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం కుటుంబాలకు కాలనీ ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముస్లిం సోదరులు, సోదరీమణులకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కొత్తగా ఎన్ని మంజూరు చేశారో వెల్లడించాలని కోరారు.
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బాజీబాబా విమర్శించారు. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.
ఉర్దూ పాఠశాలల సంఖ్య పెంచుతామని, మైనారిటీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఉర్దూ పాఠశాలల సమస్యలను సైతం పట్టించుకోని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మైనారిటీలకు అన్నీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని బాజీబాబా పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ముస్లిం మైనారిటీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బాజీబాబా డిమాండ్ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మైనారిటీల తరఫున వైఎస్సార్సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.



