దర్శి (ప్రకాశం జిల్లా):– ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును అపహాస్యం చేసిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. మజుంధర్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శి పట్నంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ ఆఫీస్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మజుంధర్ మాట్లాడుతూ… స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యులతో రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా, గత 10 నెలల్లో 14 సార్లు మిగతా ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించినా ఖాతరు చేయకుండా జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ‘సర్’ (SUR) ప్రక్రియ, కొత్త ఓట్ల చేర్పులు, బెంగాల్, అస్సాం, బీహార్ ఎన్నికల నిర్వహణ తదితర కీలక అంశాల్లో మెజారిటీ అభిప్రాయాన్ని పక్కనబెట్టి, బిజెపికి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉండే అర్హతను ఆయన కోల్పోయారని, బిజెపికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజల హక్కులను కాలరాశారని ఆరోపించారు. జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.Prakasam district news
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ, సీపీఎం నాయకులు తాండవ రంగారావు మాట్లాడుతూ… ‘సర్’ ప్రక్రియ పేరుతో 2002 ఓటర్ల జాబితాకు, ఇప్పటి జాబితాకు తేడాలు ఉన్నాయంటూ కోట్ల మంది ప్రజలకు నోటీసులు ఇచ్చి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు ఉందో లేదో నిరూపించుకోవడానికి పేద ప్రజలు పనులు మానుకుని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ, సీపీఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, సందు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి, సువార్తమ్మ, ఉప్పు నారాయణ, దాసు, ఇస్రాయేల్, ఆదినారాయణ, సాల్మన్, టి. తిరపతమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.



