అమరావతి, సెప్టెంబర్ 12: రైతు పండించిన పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధర లభించి నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుకు ధర రక్షణ కల్పించడమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు పంటకు గిట్టుబాటు ధర లభించని సమయంలో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలుస్తోందని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో రైతులకు పెద్దగా ప్రయోజనం కల్పించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు చూపించి, వాస్తవంగా రైతులకు ఎంత మేరకు నిధులు అందించారనే విషయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. రైతుల పంటలకు ధరలు పడిపోయిన సమయంలో జగన్ ప్రభుత్వం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.Amaravathi city news
2025–26 ఆర్థిక సంవత్సరంలో వివిధ పంటలకు ధరల రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.800 కోట్ల వరకు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో పొగాకుకు రూ.271 కోట్లు, మామిడికి రూ.261 కోట్లు, ఉల్లికి రూ.125 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, టమాటాకు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
తోతాపురి మామిడికి ధర లోటు భర్తీ
మార్కెట్లో తోతాపురి మామిడి ధరలు పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు కిలోకు రూ.4 చొప్పున ధర లోటును ప్రభుత్వం భర్తీ చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించినట్లు చెప్పారు. మొత్తం 7.03 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు చెల్లించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకు రకాలను సాగు చేస్తున్న రైతులకు కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహకం అందించినట్లు మంత్రి తెలిపారు. మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది పొగాకు రైతులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో రైతులను గాలికొదిలేశారు
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప పంటలకు ధరలు పడిపోయిన సందర్భాల్లో వారికి అండగా నిలిచిన దాఖలాలు లేవని ఆరోపించారు.
2020లో మార్కెట్ ధర సుమారు రూ.12 వేలుగా ఉన్నప్పటికీ కేవలం రూ.7 వేల మద్దతు ధర ప్రకటించి, దానిని అమలు చేసేందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయలేదని మంత్రి ఆరోపించారు. రైతులకు వాస్తవంగా ఎంత సాయం చేశారో చెప్పకుండా కాగితాలపై భారీ మొత్తాలు చూపించి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం రూ.2,140 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చూపించి, వాస్తవంగా రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం ఆ ప్రభుత్వ అసమర్థతకు, రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
అవసరమైన సమయంలో మార్కెట్లో జోక్యం
వైసీపీ ప్రభుత్వం రైతులను మాటలతో మోసం చేస్తే, కూటమి ప్రభుత్వం చేతల్లో అండగా నిలుస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. పంట ధరలు పడిపోయిన ప్రతిసారీ రైతు మార్కెట్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, అవసరమైన సమయంలో ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని రైతును ఆదుకోవడం కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. పంటకు ధర లేక రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అవసరమైన ప్రతి సందర్భంలో మార్కెట్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకు అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.



