అమరావతి, అక్టోబర్ 8:– రాజధాని అమరావతిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. గురువారం రాజధాని పరిధిలో ఏడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ తాగునీటి ప్రాజెక్టుల పనులను ఆమె పరిశీలించారు.
వెంకటపాలెం వద్ద కృష్ణానదిలో నిర్మిస్తున్న 380 ఎంఎల్‌డీ ఇన్‌టేక్ వెల్ ట్యాంకుల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, కార్మికుల సంఖ్య, వినియోగిస్తున్న యంత్రాలు, నిర్దేశించిన నిర్మాణ లక్ష్యాలపై ఏడీసీ చీఫ్ ఇంజినీర్ టి.మోజెస్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల క్రితం తాను పరిశీలించిన పనులతో పోలిస్తే ప్రస్తుతం జరిగిన పురోగతిని పరిశీలించిన ఆమె, పనులను మరింత వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కృష్ణాయపాలెం వద్ద ఇన్‌టేక్ వెల్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఫేజ్-1 పనులను పరిశీలించారు. రోజుకు 190 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ పనులను చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ తదితరులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.Amaravathi News
రాజధాని పరిధిలో మొత్తం ఏడు నీటి సరఫరా కేంద్రాలను నిర్మిస్తున్న నేపథ్యంలో ఎన్-4 రోడ్డుకు సమీపంలో నిర్మిస్తున్న 2,400 కిలోలీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్లాంట్‌కు సంబంధించిన కుషన్ ట్యాంక్ నిర్మాణ పనులను కూడా ఆమె పరిశీలించారు. 2027 మే నాటికి ప్రాజెక్టుకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనులను పూర్తి చేయాలని ఎన్‌సీసీ గుత్తేదారు సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో ఎల్‌పీఎస్ జోన్-9, జోన్-12లో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఈ పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్ సీహెచ్.ధనుంజయ, సూపరింటెండింగ్ ఇంజినీర్లు టి.వైకుంఠరావు, ఆర్.హనుమంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎం.శ్రీధర్‌రెడ్డి, ఎన్.శివలింగరావు, వై.అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.



