బాపట్ల: దైనందిన జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటారని, అయితే సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే కార్యసాధకుల అంతిమ లక్ష్యం మాత్రం సమాజ అభివృద్ధేనని ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు, రచయిత చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించిన శ్రీ తొండపు దశరథ జనార్ధన్ అధ్యాపక వృత్తిని ఎంచుకోకపోయినా, ఆర్థిక శాస్త్రంపై తనకున్న అవగాహనను సమాజ సేవకు వినియోగిస్తున్నారని తెలిపారు. రాజకీయ రంగంలో కొనసాగుతూనే, ప్రతి ఒక్కరూ ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుని తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆర్థికంగా ఎదిగి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని జనార్ధన్ సూచిస్తున్నారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొనే పార్టీ శ్రేణులకు, అలాగే సమాజంలో తనకు పరిచయమయ్యే ప్రతి ఒక్కరికీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన మార్గనిర్దేశం చేయడంతో పాటు, వారు ఆర్థికంగా స్థిరపడేలా తగిన సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని చండ్ర ప్రసాద్ తెలిపారు.
కోట్లాది మంది తెలుగువారిలో సమాజం పట్ల ఇంతటి బాధ్యతాయుతమైన భావజాలం కలిగిన వారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారని, వారిలో జనార్ధన్ ఒకరని అన్నారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు ఆశయాలు, భావజాలాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ఒక యజ్ఞంగా భావిస్తూ నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
శ్రీ తొండపు దశరథ జనార్ధన్ చేస్తున్న నిర్విరామ కృషికి, అకుంఠిత దీక్షకు భగవంతుడు మరింత ఆత్మశక్తిని ప్రసాదించాలని ఎన్టీఆర్ కళాపీఠం తరఫున ఆకాంక్షిస్తున్నట్లు చండ్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాపీఠం గౌరవ సలహాదారు ఇప్పిలి శైలజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



