AP LATEST NEWS: పొగాకు రైతులకు రూ.226 కోట్ల మేర అదనపు సుంకం నుంచి ఉపశమనం

Karthik

రాష్ట్రం లోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించిందని టుబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని టుబాకో బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025–26 పంట కాలానికి అదనంగా పండించిన పొగాకు, అలాగే రిజిస్టర్ కాని రైతులు పండించిన పొగాకుపై సాధారణంగా విధించే అదనపు సుంకాన్ని జీరో అదనపు సుంకంగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 44 వేల మంది పొగాకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, మొత్తంగా దాదాపు రూ.226 కోట్ల మేర ఆర్థిక ఉపశమనం లభించనుందని తెలిపారు.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, వివిధ దేశాల్లో అధిక ఉత్పత్తి తదితర కారణాలతో గత నాలుగు నెలలుగా పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఒక దశలో సుమారు 40 శాతం వరకు లోబిడ్ల పరిస్థితి నెలకొని, పొగాకు విక్రయించుకోవడం రైతులకు కష్టతరంగా మారిందన్నారు. అయితే గత రెండు మూడు వారాలుగా పరిస్థితి క్రమంగా మెరుగుపడి, రైతులు తమ ఉత్పత్తిని విక్రయించుకోగలుగుతున్నారని చెప్పారు.రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి, పొగాకు బోర్డుకు, రైతులకు అవసరమైన సూచనలు, సహకారం అందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లో గ్రేడ్, ఆఫ్ గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సహాయం అందించి, దాదాపు రూ.94 కోట్ల మేర రైతులకు ఉపశమనం కల్పించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పొగాకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.2025–26 సంవత్సరానికి పొగాకు బోర్డు నిర్దేశించిన ఉత్పత్తి పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 236 మిలియన్ కిలోల మేర పంటను పండించారని తెలిపారు. ప్రస్తుతం వేలం ప్రక్రియలో గణనీయమైన పరిమాణంలో పొగాకు విక్రయించామని, మిగిలిన పంటను కూడా వేగంగా విక్రయించేందుకు పొగాకు బోర్డు చర్యలు కొనసాగిస్తోందని చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో ఆక్షన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review