Bapatla District City news :వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలి-28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె

S Sarath
2 Views

చీరాల: బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ సెక్రటరీ జి. బ్రహ్మయ్య తెలిపారు. శనివారం చీరాలలోని ఏఐటీయూసీ కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక వంటిదని బ్రహ్మయ్య పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలాకాలంగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఐదు రోజుల పని దినాల అంశంపై ఒప్పందం కుదిరినా, సుమారు 30 నెలలు గడిచినప్పటికీ అమలు జరగకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.Bapatla City News

ఐదు రోజుల పని దినాల డిమాండ్‌పై ఇప్పటికే పలు దశల్లో ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని బ్రహ్మయ్య అన్నారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు.

డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తదుపరి దశలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని బ్రహ్మయ్య హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో గద్దె దీవెన్ బాబు, తురకపల్లి శ్రీనివాసరావు, మల్లెల దాసు, చెన్నపాలెం వాసు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review