హైదరాబాద్: ఉద్యోగులు, కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక పక్షపాతిగా పనిచేస్తోందని అల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. గోషామహల్‌లో తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయాన్ని యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా కోటి మంది కార్మికులకు కనీస వేతనాలను అమలు చేసే చర్యలు చేపట్టిందని తెలిపారు.
జలమండలి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

త్వరలో జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు మద్దతు ఇచ్చి గెలిపించాలని మధు యాష్కీ గౌడ్ కోరారు.
మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ జలమండలి కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇదే విధంగా ఇతర రంగాల కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.



