ఉపాధి హామీ పనుల్లో రూ.30 లక్షలకుపైగా అవినీతి?

City News Telugu

అంధులను సైతం వదిలిపెట్టని అవినీతి దారులు

ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఆరోపణలు

బోగస్ మస్టర్లతో వేతనాల మంజూరు

డబ్బులు ఇవ్వకపోతే జాబ్ కార్డులో పేరు తొలగిస్తామని బెదిరింపులు

కుక్కునూరు మండలం, తొండిపాక పంచాయతీ పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. చెరువుల్లో పనులు చేయకుండానే ఫోటోలు తీసి తప్పుడు హాజరులు నమోదు చేసి ప్రభుత్వ నిధులను రూ.30 లక్షలకుపైగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారంలో మేటీలు బూడిపూడి రాము, ఈసంపల్లి నరసింహారావు, అబ్దుల్ గఫూర్, అబ్దుల్ ఖాలిక్, తాంబళ్ల నాగేంద్రబాబు, బండ్ల లీలావతి, మేరం కుమారస్వామి, ఎస్.కె. ఉమ్మర్ షరీఫ్ తదితరులు కూలీలను పనికి రాకుండానే ఫోటోలు తీసి హాజరు నమోదు చేసి, వచ్చిన వేతనాల్లో సగం తమకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా గ్రామంలో లేని వ్యక్తుల పేర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి పేర్లతో కూడా బోగస్ మస్టర్లు నమోదు చేసి, వారి పేర్లపై వచ్చిన డబ్బులను వసూలు చేసినట్లు సమాచారం. చెరువుల్లో వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఈ వ్యవహారంలో ఏపీఓ (APO), ఫీల్డ్ అసిస్టెంట్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత నాలుగు నుంచి ఐదు వారాలుగా తీగలకుంట చెరువు, బుట్టాయిగుంట చెరువు, బాబురావు చెరువు, మోహన్ రెడ్డి చెరువుల వద్ద పనులు జరగకపోయినా, ఫోటోలు మరియు వీడియోలు తీసి కూలీల పేర్లపై హాజరులు నమోదు చేసి నిధులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కూలీల వద్ద నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

విచారణలో భాగంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత సంవత్సరం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఈ ఏడాది అతనికి పని కల్పించలేదని, అలాగే ఇతర మేటీల ద్వారా కూడా ఉపాధి పనులు అందకుండా అడ్డుకున్నట్లు సమాచారం. గత సంవత్సరంలో కూడా ఇదే తరహాలో వసూళ్లు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషికి మేటీలు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, ఈ అక్రమ వసూళ్లలో అంధులు, వృద్ధులు వంటి నిరుపేదలను కూడా వదిలిపెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పేర్లపై కూడా వేతనాలు నమోదు చేసి డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, బాధ్యులైన మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్, సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే అక్రమంగా పొందిన ప్రభుత్వ నిధులను తిరిగి రికవరీ చేసి ప్రజాధనాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే, ఉపాధి హామీ పథకంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

Share This Article
Leave a review