నందిగామ:11-9-26:- కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ ఉద్యోగి సయ్యద్ ఆరిఫ్ మృతి కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారుతో పాటు పీఓఎస్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిటాల శివారు దొనబండ వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో సయ్యద్ ఆరిఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.Amaravathi Local News
ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తప్పుడు నంబర్ ప్లేట్ ఉన్న కారులో పెట్రోల్ బంక్‌కు వచ్చారు. తమకు కొంత నగదు అవసరమని, ఇచ్చిన డబ్బుకు అదనంగా పేమెంట్ చేస్తామని ఆరిఫ్‌కు ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆరిఫ్ డబ్బులు లెక్కిస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా నగదును లాక్కొని కారును వేగంగా ముందుకు నడిపారు.
ఈ క్రమంలో ఆరిఫ్ కారును వెంబడించగా సుమారు 150 మీటర్ల దూరం వరకు అతడిని కారుతో ఈడ్చుకెళ్లారు. అనంతరం రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అదే రోజు రాత్రి ఆరిఫ్ మృతి చెందాడు.
ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు నిందితులను తక్షణమే పట్టుకోవాలని ఆదేశించారు. రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ సూచనల మేరకు ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో నందిగామ రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు ఆధ్వర్యంలో కంచికచర్ల, వీరులపాడు పోలీస్ సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.NTR District News
గ్రామాలు, ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టెక్నాలజీ బృందాల సహకారంతో నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గుజ్జర్లపూడి మహేష్ (18), సత్తెనపల్లి; చుండి మనోజ్‌కుమార్ (18), నరసరావుపేట; కామసాని ఆదిత్య (23), నరసరావుపేట; కూచిపూడి అరవింద్ (18), నరసరావుపేట; మంద రోహిత్ (18), నరసరావుపేట టౌన్‌కు చెందిన వారు ఉన్నారు. సత్తెనపల్లికి చెందిన ఒక మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా డీసీపీ బి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అదనంగా డబ్బులు ఇస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, నేరాలకు పాల్పడి చెరసాలపాలు కావద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన కంచికచర్ల ఎస్సైలు విశ్వనాథ్, నాని నరేంద్ర, వీరులపాడు ఎస్సై అభిమన్యు, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. అనంతరం సిబ్బందికి రివార్డులు అందజేశారు.



