ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో, ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల, అమరావతి రోడ్‌లో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు.ఈ మెగా జాబ్ మేళాకు మొత్తం 742 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకాగా, ప్రాథమిక ఎంపికల్లో 365 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సంజీవరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా ఉద్యోగ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో ఇంకుక్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ మెల్లో టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పి, మాల్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుక్ ఎక్స్‌పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమారియా హెల్త్ కేర్, డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపెక్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, స్కిల్జా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ఐటి సొల్యూషన్స్ లిమిటెడ్ సహా 30కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మొత్తం 1,100 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచగా, వివిధ విద్యార్హతలు కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి ఉపాధి కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల,టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌళిక మాట్లాడుతూ… యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధి అధికారి అభినవ్ మాట్లాడుతూ… యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతరం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తోందని తెలిపారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాలను వినియోగించుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, డివిజన్ అధ్యక్షులు తెలగతోటి సుధీర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, పార్లమెంట్ కార్యదర్శి గంట మౌనిక, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి అభినవ్, సీడాప్ జెడిఎం రాంబాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సంజీవరావు, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి పి. ఈశ్వర్‌రావు, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



