యద్దనపూడి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరేలా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. యద్దనపూడిలో నిర్వహించిన పర్చూరు నియోజకవర్గ మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం విద్యార్థులతో, తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే, విద్యార్థి జీవితానికి తరగతి గదే బలమైన పునాదని అన్నారు. లక్ష్యసాధన కోసం నిరంతర కృషి, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం అత్యంత అవసరమని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరించి వారికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని గుర్తు చేసుకున్నారు.
‘తల్లికి వందనం’తో తల్లుల ఖాతాల్లో రూ.2.59 కోట్లు జమ
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు చెప్పారు. పర్చూరు నియోజకవర్గంలో మొత్తం 25,963 మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలో ఉండగా, తాజాగా 1,335 మంది తల్లుల ఖాతాల్లో రూ.2,59,35,000 జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను పిల్లల విద్యాభివృద్ధి కోసమే వినియోగించాలని తల్లులకు సూచించారు.
పాఠశాల అభివృద్ధికి పలు ఆదేశాలు
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పాఠశాలలో 1000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని స్పష్టం చేశారు.
హాస్టల్, క్యాంటీన్లపై ప్రత్యేక పరిశీలన
కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పాఠశాల క్యాంటీన్, డైనింగ్ హాల్, హాస్టల్ గదులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై ఆరా తీసి, అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పచ్చదనంతో పాఠశాలలు ముస్తాబు చేయాలి
పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేలా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని డ్వామా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను కూడా నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శానిటైజేషన్, సురక్షిత తాగునీటి సరఫరాపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఎంఈవోలు సుబ్రహ్మణ్యం, గోపి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ రవికుమార్, ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, నాయకులు కనపర్తి నాగేశ్వరరావు, తారకరామారావు, సతీష్, నారాయణస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



