గుంటూరు: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో దివ్యాంగులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు దివ్యాంగుల హక్కుల చట్టం-2016 కింద ఉన్న SIPDA నిధులను వినియోగించి వీల్‌చైర్లు, ర్యాంపులు, లిఫ్టులు, ప్రత్యేక మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు.
ఈ మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణప్పను కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా షేక్ కాలేషా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో దివ్యాంగులకు సులభంగా చేరుకునేలా మౌలిక వసతులు కల్పించడం దివ్యాంగుల హక్కుల చట్టం-2016లో భాగమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న SIPDA నిధులను సమర్థంగా వినియోగిస్తే ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిస్థాయిలో దివ్యాంగులకు అనుకూలంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
ఇటీవల బాపట్ల జిల్లాలో ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా స్పందించిన కలెక్టర్ జిల్లా అధికారులకు, శాఖాధిపతులకు Lr.Rc.No.A/RPWD ACT/2016/IMP-1, తేదీ: 01-06-2026 ప్రకారం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఆదేశాల ప్రతులను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణప్పకు అందజేసినట్లు తెలిపారు.
బాపట్ల జిల్లాలో అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో వీల్‌చైర్లు, ర్యాంపులు, లిఫ్టులు, ప్రత్యేక మరుగుదొడ్లు, ఇతర దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని సేవలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.



