విజయవాడ:జూలై 28:– ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఎలాంటి రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించి కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల జారీ, పీఎం ఫసల్ బీమా నమోదు, మెప్మా, డీఆర్‌డీఏ రుణాల మంజూరు, ఏపీ టిడ్కో గృహాల నిర్మాణం, జిల్లా వార్షిక రుణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. రానున్న మూడు నెలల్లో కూడా సాధారణ వర్షపాతంతో పోలిస్తే 35 నుంచి 40 శాతం వరకు లోటు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు సూచనలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
పీఎం ఫసల్ బీమా యోజన కింద జిల్లాలోని ప్రతి రైతు నమోదు అయ్యేలా గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, పీఎం ఫసల్ బీమా యోజన నమోదు ఈ నెల 31 వరకు కొనసాగుతుందని, వరి పంటకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
లోటు వర్షపాతం పరిస్థితుల్లో వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. పశువులకు మేత కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెప్మా, డీఆర్‌డీఏ ద్వారా సమర్పించిన ప్రాజెక్టు నివేదికల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 100 శాతం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మొత్తాన్ని తగ్గించడం వల్ల స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికం, రిటైల్ రంగాలకు అవసరమైన రుణాలను విస్తృతంగా మంజూరు చేయడంతో పాటు సీసీఆర్‌సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు కూడా రుణాల పంపిణీ పెంచాలని సూచించారు.
గ్రామీణ మహిళలకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు, రుణాల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, ఆర్థిక ప్రణాళికపై విస్తృత స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను 100 శాతం అమలు చేసిన జిల్లా లీడ్ బ్యాంకు, వివిధ బ్యాంకులు, సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు.
సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ పి. వెంకటసుబ్బయ్య, డీసీసీ–డీఎల్‌ఆర్‌సీ కన్వీనర్ ఎం.వి. తిలక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ వి. అమరేశ్వరరెడ్డి, ఆర్‌బీఐ ఎల్‌డీఓ ఏ. రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏ.ఎన్.వి. నాంచార్రావు, మెప్మా పీడీ మురళీకృష్ణ ప్రసాద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



