చీరాల, ఆగస్టు 7 :– చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెనకబడిపోయిన బీసీ వర్గాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నేతన్నలకు మరపురాని రోజుగా నిలవాలనే ఉద్దేశంతో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నామని, దీనికి ఈ పథకమే నిదర్శనమని పేర్కొన్నారు.

చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని సీఎం అన్నారు. చీరాల పేరు వినగానే ఇక్కడి నేతన్నల నైపుణ్యం గుర్తుకు వస్తుందని, చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందాయని చెప్పారు. ఒకప్పుడు విదేశాలకు భారీగా ఎగుమతి అయిన చీరాల ఖర్చీఫ్‌లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

చీరాలతో పాటు వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 1.27 లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయని వెల్లడించారు. అలాగే 50 ఏళ్లకే చేనేత కార్మికులకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద నెలకు రూ.4 వేల చొప్పున అందిస్తున్నామని, 85 వేల మంది నేతన్నలకు ఏడాదికి రూ.420 కోట్ల మేర పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్, రూ.10 కోట్లతో 10 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి ఆమోదం, హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ ద్వారా మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి శాఖమూరులో చేనేత–హస్తకళల మ్యూజియం, విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, వెనకబడిపోయిన బీసీ వర్గాలకు అండగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రూ.505 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాల కేటాయింపు చేపట్టామని, బీసీలకు 3 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు అదనంగా రూ.20 వేల సబ్సిడీ అందిస్తున్నామని వెల్లడించారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తున్నామని, దానికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ రూ.2.5 లక్షల యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేదలకు రూ.5కే అన్నా క్యాంటీన్లలో భోజనం అందిస్తున్నామని, గతంలో వాటిని మూసివేసిన పరిస్థితిని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.
విద్య అందరికీ చేరాలనే లక్ష్యంతో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ వారి తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా సమానంగా దృష్టి పెట్టామని, గతంలో గుంతలతో నిండిన రహదారులను మరమ్మతు చేసి మెరుగుపరిచామని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఇప్పటికే రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వివరించారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, బాపట్ల, చీరాల తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, రూ.97 కోట్ల స్వదేశ్ దర్శన్ నిధులతో సూర్యలంక నుంచి చీరాల వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.



