అమరావతి, ఆగస్టు 18:– రాష్ట్ర హైకోర్టులో మీడియేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయ శాఖకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడినట్లు న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.
హైకోర్టులో 14 మంది సిబ్బందితో మీడియేషన్ సెంటర్, 15 మంది సిబ్బందితో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వివాదాలను న్యాయస్థానానికి వెలుపల మధ్యవర్తిత్వం, పరిష్కార మార్గాల ద్వారా వేగంగా పరిష్కరించేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
అదేవిధంగా హైకోర్టు పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టును భర్తీ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ పరిధిలో పనిచేస్తున్న పీపీ లేదా ఏపీపీని డిప్యుటేషన్‌పై నియమించే విధంగా ఈ పోస్టును భర్తీ చేయనున్నట్లు వివరించారు.
ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఫరూక్ తెలిపారు. సత్వర న్యాయం అందించే దిశగా న్యాయ శాఖలో పరిపాలనా, కార్యాచరణపరమైన మార్పులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే హైకోర్టులో రిజిస్ట్రార్ (కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్) పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో న్యాయ సేవలను విస్తృతం చేయడం ద్వారా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలవుతుందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.



