Mangalagiri Local News :హస్తకళలకు సాంకేతికత జోడిస్తే కళాకారులకు కొత్త అవకాశాలు-(APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

Sharat
1 View

మంగళగిరి, ఆగస్టు 18:– సంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను అనుసంధానం చేసి కళాకారులకు కొత్త మార్కెట్లు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే APHDC క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్–2026 ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.

మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)లో APHDC ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్–2026 తుది పోటీలు, ప్రోటోటైప్ ప్రదర్శన, మూల్యాంకన కార్యక్రమంలో హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది కళాకారులు పోటీల్లో పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 12 మందిని తుది దశకు ఎంపిక చేశారు. తుది మూల్యాంకనం అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేశారు.

తుది దశలో కళాకారులు రూపొందించిన వినూత్న ప్రోటోటైప్‌లను జ్యూరీ సభ్యుల ముందు ప్రదర్శించారు. OSD లక్ష్మీనాథ్, DCH అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణా లక్ష్మి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌కు చెందిన మాధవరావు తదితరులు జ్యూరీ సభ్యులుగా పాల్గొని ప్రోటోటైప్‌లను పరిశీలించి మూల్యాంకనం చేశారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళలు రాష్ట్ర సాంస్కృతిక సంపదగా పేర్కొన్నారు. వాటికి సాంకేతికత, ఆధునిక డిజైన్, మార్కెట్ అవసరాలను అనుసంధానం చేస్తే కళాకారుల ప్రతిభకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని అన్నారు. కళాకారుడి సంప్రదాయ నైపుణ్యానికి సాంకేతికత తోడైతే కళకు కొత్త మార్కెట్, కళాకారుడికి కొత్త భవిష్యత్తు ఏర్పడుతుందని పేర్కొన్నారు.

క్రాఫ్ట్‌టెక్ హ్యాకథాన్‌లో సంప్రదాయ హస్తకళా బొమ్మలకు ఇంటరాక్టివ్, యాంత్రిక సాంకేతికతను జోడించడం, సహజ మరియు స్థానిక పదార్థాలతో స్థిరమైన ఆహార-గ్రేడ్ ప్యాకేజింగ్ పరిష్కారాలను రూపొందించడం వంటి అంశాలపై పాల్గొనేవారు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేశారు.

పోటీలతోనే కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా అత్యుత్తమ ప్రోటోటైప్‌లను భవిష్యత్తులో ఉత్పత్తులుగా అభివృద్ధి చేసి మార్కెట్‌కు అనుసంధానం చేసే దిశగా APHDC పనిచేస్తుందని హరిప్రసాద్ తెలిపారు. “సంప్రదాయం నుంచి ఆవిష్కరణ వైపు.. ఆవిష్కరణ నుంచి మార్కెట్ వైపు” అనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల నైపుణ్యాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసి స్థిరమైన ఆదాయం, కొత్త మార్కెట్లు, మెరుగైన అవకాశాలు కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో APHDC డైరెక్టర్ RDS ప్రసాద్, యశస్విని తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review