Eluru Local News :వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

Sharat
1 View

ముసునూరు:– వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, రైతులు దేశానికి నిజమైన వెన్నెముక అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ముసునూరు వద్ద గౌర్మెట్ పాప్‌కార్నికా నాన్‌-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాల ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన ప్రసంగించారు.

దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు రైతులు ఆహార భద్రత కల్పిస్తున్నారని, దేశ శ్రామిక శక్తిలో దాదాపు 45 శాతం మందికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం దేశ జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 17 శాతంగా ఉందన్నారు. పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరిస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

వరి, గోధుమల తర్వాత దేశంలో మొక్కజొన్న మూడో అత్యంత ముఖ్యమైన ఆహార పంటగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 169 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతోందని, ఏటా 4.3 కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతోందన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే రకాల అవసరం

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని గవర్నర్ తెలిపారు. వర్షపాతం లోటు ఏర్పడితే మొదట వ్యవసాయ రంగమే ప్రభావితమవుతుందని, ఆ తర్వాత పంటలు, పశువులు, గృహ ఆస్తులు, ఆహార భద్రతపై దాని ప్రభావం పడుతుందని వివరించారు.

మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల కారణంగా ఎల్‌నినో ప్రభావం భారత వ్యవసాయ రంగంపై పరిమితంగా ఉండే అవకాశం ఉందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తక్కువ నీటితో, తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మంచి దిగుబడినిచ్చే కరువు తట్టుకునే మొక్కజొన్న, వరి రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ల అభివృద్ధి అభినందనీయం

భారతదేశంలోని విభిన్న వ్యవసాయ-వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాప్‌కార్న్ హైబ్రిడ్‌లను అభివృద్ధి చేయడంలో గౌర్మెట్ పాప్‌కార్నికా చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. అమెరికన్ మిడ్‌వెస్ట్‌లోని సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చేసిన సంప్రదాయ పాప్‌కార్న్ రకాల సవాళ్లను అధిగమిస్తూ, భారతీయ నేల, వాతావరణ పరిస్థితులకు అనువైన ఉష్ణమండల హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేయడం ప్రశంసనీయమన్నారు.

మెరుగైన గింజ విస్తరణ నిష్పత్తి, వ్యాధి నిరోధకత, స్థిరమైన దిగుబడి వంటి లక్షణాలతో హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేయడంలో సంస్థ చేస్తున్న ప్రయత్నాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.

17,500 మంది రైతులతో సంస్థ భాగస్వామ్యం

గౌర్మెట్ పాప్‌కార్నికా ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 మంది రైతులతో కలిసి పనిచేస్తూ 39,500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుకు సహకరిస్తుండటం సంతోషకరమని గవర్నర్ తెలిపారు. సంస్థ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా 3,400కు పైగా సినిమా హాళ్లలో విక్రయించబడుతున్నాయని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన రైతులకు పాప్‌కార్న్ సాగును పరిచయం చేసేందుకు సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.

భారత రైతులకు 70 శాతం ఆదాయం

గతంలో పాప్‌కార్న్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం అర్జెంటీనా, బ్రెజిల్ రైతులకు వెళ్లేదని గవర్నర్ తెలిపారు. అయితే నాణ్యతపై గౌర్మెట్ పాప్‌కార్నికా ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం పాప్‌కార్న్ విక్రయాల ఆదాయంలో 70 శాతం భారతీయ రైతులకు దక్కుతోందని, తద్వారా 125 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతోందని వివరించారు.

గిరిజన రైతుల సహకార వ్యవస్థకు అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన అరకు కాఫీ తరహాలోనే గౌర్మెట్ పాప్‌కార్నికా కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌గా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సంస్థ భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతం కావాలని కోరుతూ, రైతుల ఆదాయం పెంపుతో పాటు దేశ వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చాలని అభిలషించారు.

Author
Share This Article
Leave a review