NTR District News : ఒంటరి మహిళ పింఛన్‌కు వయసు నిబంధన ఎత్తివేయాలి

Sharat
1 View

జగ్గయ్యపేట:10-09-26:- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఒంటరి మహిళల పింఛన్‌కు అమలులో ఉన్న వయసు నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 50 సంవత్సరాలు నిండిన వారే అర్హులుగా ఆన్‌లైన్‌లో చూపిస్తుండటంతో అర్హత ఉన్నప్పటికీ పలువురు మహిళలు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఒంటరి మహిళ పింఛన్‌కు 35 సంవత్సరాలు పైబడిన వారు అర్హులుగా ఉండేవారు. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ అర్హత వయసును 50 సంవత్సరాలకు పెంచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పింఛన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించినప్పటికీ, ఒంటరి మహిళల పింఛన్‌కు సంబంధించిన వయసు నిబంధనలో మార్పులు చేయకపోవడంతో సమస్య కొనసాగుతోందని మహిళలు పేర్కొంటున్నారు.

మనస్పర్థలు, కుటుంబ పరిస్థితులు, ఇతర అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు, భర్తకు దూరంగా జీవిస్తున్న మహిళలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి వారికి వయసుతో సంబంధం లేకుండా పింఛన్ అందేలా నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

ఒంటరి మహిళల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పింఛన్ అర్హతలో 50 సంవత్సరాల వయసు నిబంధనను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను ఒంటరి మహిళలు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో అవసరమైన మార్పులు చేసి అర్హులైన ప్రతి ఒంటరి మహిళకు పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review