మార్కాపురం :– మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి అన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణంలో ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో భారీగా ఫీజులు చెల్లించలేక చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురానికి చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సమీపంలోని పెద్దారవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి రావాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.Markapuram district news
జిల్లా కేంద్రంగా మారిన మార్కాపురంలో వెంటనే ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కళాశాలల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



