B. Sankar, Desk Incharge | Bapatla: చీరాలలోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాలకు పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు SASA రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.బి. భాగ్యలక్ష్మి అందుకున్నారు.
పాఠశాలలో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యర్థాలను వేరు చేయడం, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో చేపట్టిన చర్యలను గుర్తించిన అవార్డు కమిటీ పాఠశాలకు రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందించింది.

పాఠశాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు ఐటీసీ ఫినిష్ సొసైటీ సుమారు రూ.10 లక్షల విరాళంతో సహకరించింది. సంస్థ కార్యదర్శి గిరికులం సహకారంతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ అవార్డు సాధనలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, డీటీడబ్ల్యూఓ సిబ్బంది, కార్మికులు, భద్రతా సిబ్బంది, ఆయాలు సమిష్టిగా కృషి చేశారు. ప్రస్తుతం పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అవార్డు అందుకున్న అనంతరం ప్రిన్సిపాల్ ఎం.బి. భాగ్యలక్ష్మి, పాఠశాల సిబ్బంది మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవార్డును కలెక్టర్కు చూపించారు. అవార్డు సాధించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఐటీసీ ఫినిష్ సొసైటీకి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.



