Palnadu District City News :స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి-జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి

S Sarath
1 View

పల్నాడు జిల్లా, అక్టోబర్ 14:-పల్నాడు జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి తెలిపారు.

జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 28 మండలాలు, 34 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 525 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 5,476 పోలింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. వీటిని అత్యంత సున్నితమైన, సున్నితమైన, సాధారణ ప్రాంతాలుగా వర్గీకరించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల బందోబస్తు కోసం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, తనిఖీ కేంద్రాలు, షాడో పార్టీలను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తూ, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.Palnadu District news

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. రౌడీషీటర్లు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అక్రమంగా గుమిగూడడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review