Bapatla District City News :తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి.. మంత్రి గొట్టిపాటి రవికుమార్

S Sarath
2 Views

మురసు తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

బుధవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే ముద్దులూరి కొండయ్యతో కలిసి చిన్నగంజాం మండలం పల్లెపాలెంలో పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి విద్యుత్ అంతరాయాలు, ఇతర ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించినట్లు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి రెండు వేల మందికి పైగా విద్యుత్ సిబ్బంది వచ్చి మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నారని, ఏపీఎస్పీడీసీఎల్ నుంచి మరో వెయ్యి మంది సిబ్బందిని ప్రకాశం, పల్నాడు జిల్లాలకు పంపినట్లు వివరించారు.

విద్యుత్ శాఖ సీఎండీ నుంచి లైన్‌మెన్‌ వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ విద్యుత్ పునరుద్ధరణ చర్యల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

మరమ్మతు పనులు చేపట్టే సమయంలో విద్యుత్ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చోట అదనపు సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచి పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.Bapatla District City News

కర్ణాటకలోని గుల్బర్గా నుంచి వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న సిబ్బందిని మంత్రి కలిసి వారి సేవలను అభినందించారు. చీరాలలో తమిళనాడు నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి వారితో మాట్లాడారు. తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో తమ సొంత ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చి ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. బాధితులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Author
Share This Article
Leave a review