Bapatla District City News :మురుసు తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా.. సహాయక చర్యల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ -ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

S Sarath
1 View

పర్చూరు:- మురుసు తుఫాను గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర బీభత్సం సృష్టించడంతో పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సేవలందించారని తెలిపారు. బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యంగా తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏలూరి వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పనులను కేవలం రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో పక్క రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది నిపుణులైన ఇంజినీర్లు, అధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బందిని రప్పించి నిరంతరాయంగా పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని కొనియాడారు.

తుఫాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బాధితులకు ఆహారం అందించడం, అవసరమైన సహాయం చేయడం ద్వారా ప్రజలకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తల సేవలను అభినందించారు.Bapatla District City News

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. తుఫాను బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని తెలిపారు.

Author
Share This Article
Leave a review