Bapatla District City News : ఆధ్యాత్మికతతో సమాజ సేవే లక్ష్యంగా డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి-ఎన్టీఆర్ కళాపీఠం జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు.. ఘనంగా సత్కారం

S Sarath
2 Views

ఒంగోలు, అక్టోబర్ 7:- ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు, పూజలు చేయడం మాత్రమే కాదని, నిజాయితీ, సత్యం, కనికరం, స్వచ్ఛమైన మానవీయ విలువలను పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత అని రచయిత, ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆధ్యాత్మికత, వాస్తు, జ్యోతిష్య అంశాలను వినియోగిస్తూ సేవా భావంతో ముందుకు సాగుతున్న డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామిని ఎన్టీఆర్ కళాపీఠం సభ్యులు ఘనంగా సత్కరించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని తూర్పునాయుడుపాలెంకు చెందిన డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి కుటుంబానికి ఆరు తరాలుగా ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని చండ్ర ప్రసాద్ తెలిపారు. వినయ విధేయతలు, నిరాడంబరతతో కూడిన వారి నివాసం ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావ సంపత్తితో పాటు వాస్తు, జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారని తెలిపారు.

శ్రీధర్ అన్నయ్య శ్రీహరి మురళీకృష్ణ మూర్తి తెలుగు భాషకు, విద్యారంగానికి విశేష సేవలందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. శ్రీధర్ బ్యాంకింగ్ రంగంలో ఆఫీసర్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ స్థాయి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.Bapatla District City News

అదేవిధంగా శ్రీధర్ సోదరుడు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య వృత్తిలో పేద ప్రజలకు సేవలందించారని, అనంతరం కొండేపి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారని చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కుటుంబం నుంచి సమాజం నేర్చుకోవాల్సిన విలువలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

ఎన్టీఆర్ కళాపీఠం జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టేందుకు డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి అంగీకరించడం పట్ల కళాపీఠం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ కళాపీఠం కార్యదర్శి, ఎన్టీఆర్ అభిమాని బొప్పన ప్రవీణ్ కుమార్, ఎన్టీఆర్ వీరాభిమాని తలారి చెన్నయ్య, కార్యాలయ ఉద్యోగి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

దాదాపు మూడు దశాబ్దాల పరిచయంలో శ్రీధర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చండ్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రత్యక్షంగా కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఆధ్యాత్మికతతో కూడిన వ్యక్తిత్వం ఉన్నవారు అడుగుపెట్టిన ప్రదేశం కూడా పవిత్రతను సంతరించుకుంటుందనే భావన తనకు కలిగిందన్నారు.

అమరావతి రాజధానిలోని అసెంబ్లీ ప్రాంగణంలో 2026 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించిన ‘శకపురుషునికి శత వ్యాస నీరాజనం’ గ్రంథాన్ని డోలా శ్రీధర్‌కు అందజేసినట్లు చండ్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్టీఆర్ కళాపీఠం గౌరవ సలహాదారు ఇప్పిలి శైలజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Author
Share This Article
Leave a review