విశాఖపట్నం: జూలై 31 :– అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని సూచించారు.
ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విమానాశ్రయ ప్రాంగణం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా అలంకరించాలని సూచించారు.
ప్రధానికి స్వాగతం పలికే సందర్భంగా గిరిజన సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని అన్నారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అతిథుల రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమలు–మౌలిక సదుపాయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొని ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు.



