విజయవాడ, సెప్టెంబరు 12:– బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో శనివారం బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో బీసీ రక్షణ చట్టంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీలంటే టీడీపీ అనే భావన ప్రజల్లో ఉందన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచే విధంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల ముందు నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించడం, సంఘ బహిష్కరణలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. కోర్టుల్లో బలంగా నిలిచే విధంగా చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, రెండు నెలల్లో కేసుల దర్యాప్తు పూర్తి చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.Vijayawada Local News
రాష్ట్రంలోని 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి కూడా చట్టంపై అభిప్రాయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. 1987లో అన్న ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. దీనివల్ల బీసీలకు రాజకీయంగా తీవ్ర నష్టం జరిగిందన్నారు. మరోసారి 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
90 శాతం హామీల అమలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని మంత్రి సవిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అత్యధికంగా బీసీలే లబ్ధి పొందుతున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ పాలనపై నమ్మకంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పారు. త్వరలో ఆదరణ 3.0ను అమలు చేస్తామని తెలిపారు.
జగన్‌లో ఓటమి భయం
చంద్రబాబు పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోందని మంత్రి సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌లో మరోసారి ఓటమి భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు సూచించారు.
బీసీ రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి సవితకు వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి సవితను ఘనంగా సత్కరించారు.
అంతకుముందు మంత్రి సవిత అన్న ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణతో పాటు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట్ గురుమూర్తి, నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వరరావు, నర్సింహాయాదవ్, మల్లెల ఈశ్వర్, దేవేంద్రప్ప, చిలకలపూడి పాపారావు, కొల్లు పెద్ది రాజు, సీఆర్ రాజన్, రుద్రకోటి సదాశివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



