GUNTUR DISTRICT NEWS: పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన కలెక్టర్

Karthik
4 Views

జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సోమవారం పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంపాలెం భారత్ పెట్రోల్ బంకును, వెంకటప్పయ్య కాలనీ లోని  హెచ్.పి పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. బంకులలో ఇంధన నిల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంధనం కోసం వచ్చిన వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితులను ఆరా తీసారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దని కోరారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి బంక్ వద్ద ఒక ఉద్యోగిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.  ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ తో సహా, జాయింట్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలించడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేశారని, సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review