GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Karthik

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని, డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, దివ్యాంగులకు ర్యాంప్‌లు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతులపై సమగ్ర నివేదికను తక్షణమే అందించాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే సంబందిత ఏఈలు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశామన్నారు. అలాగే, ఎన్నికల సామగ్రి పంపిణీకి ‘డిస్ట్రిబ్యూషన్ సెంటర్’ ఎంపిక చేయాల్సిందిగా సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, నిర్ణీత ప్రాంతాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడానికి డిఎస్పీకి లేఖ రాయాలని అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 10 మరియు 12 తేదీల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ కమిషనర్-1 కు సూచించారు. ఈ శిక్షణను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగినంత మంది మాస్టర్ ట్రైనర్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల విధులకు కేటాయించబడిన ఇతర శాఖల అధికారులు, నగరపాలక సంస్థ అధికారుల మధ్య సమన్వయం ఉండేలా ఒక ప్రత్యేక ‘కమ్యూనికేషన్ సెల్’ ను తక్షణమే ఏర్పాటు చేయాలని అదనపు కమిషనర్‌ ను ఆదేశించారు.సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review