
ఆటపాటలతో సందడి చేయాల్సిన ఆరేళ్ల ప్రాయం.. కానీ విధి ఆడిన వింత నాటకానికి ఆ పసివాడు మంచానికే పరిమితమయ్యాడు. ఒక్క పొరపాటు.. ఆ చిన్నారి జీవితాన్ని నరకప్రాయం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భరణి సాయికుమార్ అనే ఆరేళ్ల బాలుడు, కూల్ డ్రింక్ అనుకుని పొరపాటున డ్రెయిన్ క్లీనింగ్ ద్రావణాన్ని తాగాడు. ఆ ఒక్క క్షణం ఆ చిన్నారి అన్నవాహికను, లోపలి పేగులను పూర్తిగా కాల్చేసింది.”
“గత రెండు నెలలుగా ఆ బాలుడు అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతం. నోటి ద్వారా ఆహారం తీసుకోలేక, గొట్టాల ద్వారానే ద్రవ పదార్థాలు అందిస్తుంటే కళ్లముందే కొడుకు పడుతున్న బాధను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి దుర్గాశ్రీనివాస్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇప్పటికే ఆరు లక్షల రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించారు. కానీ, బాబు కోలుకోవాలంటే అన్నవాహికకు మేజర్ ఆపరేషన్ చేయాలని, అందుకు మరో పదిహేను లక్షల రూపాయలు ఖర్చవుతుందని హైదరాబాద్ వైద్యులు చెబుతున్నారు.”
“డ్రైవర్‌గా పనిచేసే ఆ తండ్రికి అంత పెద్ద మొత్తం సమకూర్చే స్తోమత లేదు. శస్త్రచికిత్స ఆలస్యమైతే ఆ పసివాడి ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తన కొడుకు మళ్లీ నవ్వుతూ తిరగాలంటే దాతల సాయమే ఏకైక మార్గమని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మానవతా దృక్పథంతో స్పందించి, ఆ పసివాడి ప్రాణాన్ని కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి. మీరు అందించే చిన్న సాయం ఆ కుటుంబంలో మళ్లీ వెలుగులు నింపుతుంది. సాయం చేయదలచిన వారు స్క్రీన్‌పై కనిపిస్తున్న 91549 90880 నంబరును సంప్రదించగలరు. ఒక చిన్నారి ప్రాణం కోసం మనమంతా చేయి చేయి కలుపుదాం.”


