విజయవాడ, ఆగస్టు 5 :– ఆషాఢమాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు దంపతులు బుధవారం సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఆనవాయితీ ప్రకారం పోలీసు కుటుంబాలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సారె సమర్పించే కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల నడుమ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి కనకదుర్గమ్మ దేవస్థానానికి చేరుకుని అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు.
ఆషాఢ సారె మహోత్సవాన్ని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ తరఫున వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ గుణరాం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి అమ్మవారి గాజులు, పాకెట్ సైజు చిత్రపటం, జాకెట్, కుంకుమ, ప్రసాదాన్ని అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
దేవస్థానంలో ఈఓ శ్రీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు దేవస్థాన అధికారులు పోలీస్ కమిషనర్‌కు స్వాగతం పలికారు. వేద పండితుల సమక్షంలో ఆషాఢ సారె సమర్పణ అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా రాజశేఖరబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఆషాఢ సారె సమర్పణ సంప్రదాయం కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు, పోలీసు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, తిరుమలేశ్వరరెడ్డి, షిరిన్ బేగం, కేజీవీ సరిత, కృష్ణ ప్రసన్న, ఉదయరాణి, రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు, ఇతర ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



