Palnadu District City News :పల్నాడులో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ-ప్రాణ రక్షణకే ప్రాధాన్యం – డీఎస్పీ హనుమంతరావు

Sharat
1 View

నరసరావుపేట, సెప్టెంబర్ 26:-రోడ్డు ప్రమాదాల్లో అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నరసరావుపేట డీఎస్పీ డి. హనుమంతరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్ఎస్ఎన్ (SSN) కాలేజీ వరకు ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో జరిగే మరణాల్లో ఎక్కువగా తలకు గాయాలవడం వల్లే జరుగుతున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల మెదడుకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని వివరించారు. హెల్మెట్ తలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని, చిన్నపాటి ఇబ్బందులను సాకుగా చూపి హెల్మెట్ పక్కన పెట్టడం సరికాదన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు:

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా:

  • హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారు,
  • ట్రిపుల్ రైడింగ్ చేసేవారు,
  • సీట్ బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లు,
  • వాహనాలు నడిపే మైనర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ఈ ర్యాలీ కార్యక్రమంలో నరసరావుపేట ట్రాఫిక్ సీఐ Ch. లోకనాథం, రూరల్ సీఐ MV. సుబ్బారావు, పలువురు ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review