విజయవాడ, సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధి: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు 40కు పైగా పార్కింగ్ స్థలాలను గుర్తించారు.
QR కోడ్లతో పార్కింగ్ వివరాలు
భక్తులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలుసుకునేందుకు ట్రాఫిక్ మళ్లింపు పాయింట్ల వద్ద QR కోడ్లను అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని స్కాన్ చేయడం ద్వారా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గనిర్దేశం పొందవచ్చు. అలాగే ASTraM Citizen యాప్ ద్వారా పార్కింగ్ స్థలాల లభ్యత, ట్రాఫిక్ వివరాలను తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.
నాలుగు ప్రాంతాలుగా పార్కింగ్ ఏర్పాట్లు
విజయవాడ నగరంలోని నాలుగు వైపులా వచ్చే భక్తుల వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను విభజించారు. హైదరాబాద్, గుంటూరు, ఏలూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు నిర్దేశిత మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు.
వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను కూడా వినియోగించనున్నారు. ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాల్లో పోలీసులను నియమించి రద్దీని నియంత్రించనున్నారు.
వాహనదారులకు పోలీసుల సూచనలు
మూలా నక్షత్రం రోజున ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. భక్తులు ముందుగానే పార్కింగ్ వివరాలు తెలుసుకుని, QR కోడ్లు లేదా ASTraM Citizen యాప్ను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపి సహకరించాలని కోరుతున్నారు.
దసరా ఉత్సవాలకు వెళ్లే భక్తులు బయలుదేరే ముందు ట్రాఫిక్, పార్కింగ్ వివరాలను పరిశీలించుకోవడం ద్వారా ప్రయాణ ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.



