GUNTUR DISTRICT NEWS: నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్

Karthik

విద్యతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే దిశగా విద్యాబోధన జరగాలని ప్రముఖ వ్యాపారవేత్త, సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 1వ తేదీన గుంటూరు నల్లపాడు లోని ఎం బి టి ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో 4 నీటి శుద్ధి యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన త్రిపురమల్లు అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు గాను నాలుగు శుద్ధ జల యంత్రాలను విరాళంగా అందించడం జరిగిందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు సినీ కథానాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా చదువులపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ మూడేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్తు సుందరంగా గా ఉంటుందని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య తో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు దేశానికి కూడా భారంగా మారకూడదని తెలిపారు. జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థలను, సామాజికవేత్తలను, సేవా తత్పరులను సమన్వయ పరచుకుంటూ పలు వైవిద్యమైన కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో విద్యార్థులు సైతం చురుగ్గా పాల్గొనడం శుభపరిణామం అన్నారు. సేవారంగంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తున్న త్రిపురమల్లు అరుణ్ కుమార్ అభినందనీయులు, ఆదర్శప్రాయులని తెలిపారు. నిధుల లేమి సేవా సంస్థలకు ప్రతిబంధకంగా మారకూడదని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయంతో పాటు సమయ దానం కూడా చేయాలని కోరారు.మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోలూరి వీరారెడ్డి ప్రసంగిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించేలా వ్యక్తిత్వ వికాస నిపుణులచే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగరంలో వరుసగా మూడో ఏడాది ఎన్ఎంఎంఎస్ శిక్షణ తరగతులు నిర్వహించటం సంతోషకరమని పేర్కొన్నారు. ఎం బి టి ఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ తాళ్లూరి శేఖర్ ప్రసంగిస్తూ తమ కళాశాల అవసరార్థం నాలుగు వాటర్ ప్యూరిఫైయర్స్ అందజేసిన త్రిపురమల్లు అరుణ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు రానున్న రోజుల్లో సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని సమాజాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఎం బి టి ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు టి. ఉమామహేశ్వరరావు చొరవ తీసుకుని 75 వేల రూపాయల విలువ చేసే శుద్ధ జల యంత్రాల అవసరాన్ని గమనించి 1300 మంది విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించడానికి కృషి చేయడం అభినందనీయమని అతిధులందరూ వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మానవత కార్యవర్గ సభ్యులు సూరం నారాయణరెడ్డి, మేకల రామారావు, డైరెక్టర్ నల్లమోతు సాంబశివరావు, నేస్తం సహ వ్యవస్థాపకులు తమ్మా ధనుంజయ రెడ్డి, ఎం బి టి ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విభాగాధిపతులు పి. అనురాధ, డాక్టర్ జి.వి. సురేష్, డాక్టర్ సి.హెచ్. మోసెస్ అరవింద్, అధ్యాపక సిబ్బంది డాక్టర్ కె. శ్రీవల్లి రాణి, మహమ్మద్ అలీ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review