GUNTUR CITY NEWS: దోమల నిర్మూలనకు మిషన్ మస్కిటో పేరుతో డ్రోన్ల ద్వారా యుద్ధం – 26 చెరువుల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆపరేషన్

Karthik
3 Views

గుంటూరులో గత కొంత కాలంగా దోమల ఉధృతిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, దోమల నుండి నగర ప్రజలకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఐ బేస్డ్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను అంతం చేసేందుకు శ్రీకారం చుట్టామని, నగరంలోని ప్రధాన జలాశయాల్లో డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందుల పిచికారీ ప్రక్రియను చేపట్టినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా గుర్తించిన సుమారు 26 ప్రధాన చెరువులు మరియు మురుగునీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను లక్ష్యంగా మొత్తం 174 ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రోన్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. సాధారణంగా చెరువుల్లో దట్టంగా పెరిగిన గుర్రపుడెక్క మరియు తూటికాడ కారణంగా జిఎంసి మలేరియా సిబ్బంది నేరుగా లోపలికి వెళ్లి మందు చల్లడం ప్రమాదకరంగా ఉండటమే కాకుండా, ఫలితం కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని గుర్తించామన్నారు. సమస్యను అధిగమించేందుకు ఆధునిక ఏఐ ఆధారిత డ్రోన్లను రంగంలోకి దించామని, ఈ డ్రోన్లు నీటి ఉపరితలంపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, దోమల లార్వా అభివృద్ధి చెందే కేంద్రాలపై ఖచ్చితత్వంతో టేమిఫస్ లార్వాసైడ్ మందును పిచికారీ చేస్తున్నాయన్నారు. కేవలం చెరువుల్లోనే కాకుండా, నగరంలోని ప్రతి వార్డులోనూ ఫాగింగ్ మరియు యాంటీ-లార్వా ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయడమే కాకుండా, మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా దోమల ఉత్పత్తిని అరికట్టడం సాధ్యమవుతుందని వివరించారు. అయితే, జిఎంసి నుండి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేనిదే పూర్తిస్థాయిలో దోమల నిర్మూలన సాధ్యం కాదని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని, ప్రతి శుక్రవారం డ్రై-డే పాటించి పాత సామాన్లు, టైర్లు, పూల కుండీలలో నీటిని తొలగించుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాల బారి నుండి రక్షించుకోవచ్చని తెలిపారు.

Author
Share This Article
Leave a review