GUNTUR CITY NEWS: ఖాలీ స్థలాలను శుభ్రం చేసుకోవాలి: కమీషనర్

Karthik

గుంటూరు నగర ప్రజల ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రం చేసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మట్టితో పూడ్పించుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఈ ఆదేశాలను పాటించని పక్షంలో, నగర పాలక సంస్థ చట్టంలోని 496, 504, 639, 640 మరియు 641 సెక్షన్ల ప్రకారం నోటీసులు జారీ చేసి, నోటీసు ఇచ్చిన 7 రోజుల తర్వాత కూడా యజమానులు స్పందించని యెడల, జిఎంసి ఖర్చుతోనే ఆ స్థలాలను శుభ్రం చేయించి, ఆ ఖర్చును సదరు యజమాని నుండి ఆస్తి పన్ను బకాయి మాదిరిగా వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని మురుగు కాలువలు, ఖాళీ స్థలాలు మరియు మార్కెట్ ప్రాంతాల్లో ఇష్టానుసారం చెత్త వేయడం సరికాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు ప్రజలు, వ్యాపారులు డస్ట్ బిన్లు వాడకుండా నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల అవి పూడిపోయి, మురుగు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోందని, దీనివల్ల కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రతి హోటల్, ఫంక్షన్ హాల్ మరియు వ్యాపార సముదాయం తప్పనిసరిగా డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకుని, సేకరించిన చెత్తను కమర్షియల్ చెత్త సేకరణ వాహనాల ద్వారా మాత్రమే తరలించాలని ఆదేశించారు. ప్రజారోగ్య కార్మికులు కాలువల్లో చెత్త పేరుకుపోకుండా గ్రిల్స్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కూడా నిరంతరం శుభ్రం చేస్తున్నామని, నగర ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review