గుంటూరు, నవంబర్ 11:– ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మార్పు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారం తాడికొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల వసతి గృహం, ఎస్.వి.వి. ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని తనిఖీ చేసి, సంబంధిత అధికారులతో సమీక్షించారు.Guntur City News
ఈ సందర్భంగా పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, ప్రతి పనిలో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతి, సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోయినా సహించేది లేదని హెచ్చరించారు.
కలెక్టర్ పర్యటనలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి మయూరి, తహసీల్దార్ సీతారామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.



